తన కొడుకు, బిడ్డలకు పదవులు ఇవ్వడమే కేసీఆర్ చేస్తున్న సామాజిక న్యాయమా అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని విమర్శించారు. గుజరాత్ తరహా అభివృద్ధి తెలంగాణకు కావాలని.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించినట్లుగానే అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం సాధించి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ రాసిన ‘పరీక్ష యోధులు’ (‘ఎగ్జామ్ వారియర్స్’ రచనకు తెలుగు అనువాదం) పుస్తకాన్ని శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి, ఎన్వీ సుభాష్, సంగప్పలతో కలిసి ఆవిష్కరించారు. ‘తెలంగాణలో అవినీతి, కుటుంబ, నిరంకుశపాలనపై 16, 17 తేదీల్లో దిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాం. తెలంగాణలో అధికారం సాధించడమే మా లక్ష్యం. బండి సంజయ్ తన పాదయాత్రతో ప్రజల్ని చైతన్యవంతులను చేశారు’ అని లక్ష్మణ్ వివరించారు.