తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు తప్పు మీదంటే మీదేనంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తమపై బురద జల్లుతోందని బీజేపీ ఫైర్ అవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ శ్రేణులు నిరసనకు దిగాయి.
హైదరాబాద్ బర్కత్పుర చమన్లో కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్‌లోని కాశిబుగ్గలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలే వారి పాలనకు పట్టం కడతారని గుర్తించాలని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు అన్ని విధాలుగా బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.