మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చే సత్తా కాంగ్రెస్కు మాత్రమే ఉందని.. అందుకే బీజేపీని వీడి హస్తం కండువా కప్పుకుంటున్నానని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా పై స్పందిస్తూ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. పార్టీ మారడం అనేది వ్యక్తులపై ఆధారపడుతుందని.. ఎవరిష్టం వారిదని.. కానీ బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం తప్పని కిషన్ రెడ్డి ఖండించారు. ఆయన అనుకున్నంత మాత్రాన బీఆర్ఎస్కు బీజేపీ పోటీ కాకుండా పోతుందా అని మండిపడ్డారు.
మరోవైపు జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నాయకుడు… ఇప్పుడు నిందలు వేయడం సరికాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డిని పాసింగ్ క్లౌడ్ అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది … కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని చెప్పారు. తాను ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.