గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు బీజేపీ గాలం వేస్తోంది ఇలా

టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? అంటే అవును అనేలా ఉన్నాయ్‌ బీజేపీ చర్యలు. టీడీపిని ఖతం చేసిన టీఆర్‌ఎస్‌ని ఓడించాలి అంటే బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్‌లో సత్తా చాటేందుకు బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటోంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

అధికార పార్టీని ఎదుర్కొనేందుకు కమల దళం పక్కా స్కెచ్ వేస్తోంది. గ్రేటర్‌ పరిధిలో బలమైన ఓటు బ్యాంకు టీడీపీకి ఉంది. ఆ ఓట్లను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఓట్లు తమ పార్టీకి పడేలా కార్యచరణ రూపొందిస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గాల పెద్దలతో సమావేశాలు కూడా జరిగాయ్‌. టీడీపీతో ఉండే బలమైన సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీలోనూ టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు.

కమిటీ జాయింట్ కన్వీనర్‌గా గరికపాటి మోహన్‌రావుకి బాధ్యతలు అప్పగించారు. గరికపాటి.. గ్రేటర్ పరిధిలోఉన్న టీడీపీ క్యాడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీని తెలంగాణలో లేకుండా చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్న వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తుంది. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు బీజేపీ నేతలు. మరి కమల దళ వ్యూహం ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి.

త్వరలో మరికొందరు బీజేపీ నేతలు కాషాయ తీర్దం పుచ్చుకునే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు స్థానిక నేతలు భారీగా చేరుతారన్న ధీమాతో కమల దళం ఉంది. దుబ్బాకలో చూపించిన గ్రౌండ్‌ వర్క్‌, యాక్షన్‌ ప్లాన్‌నే గ్రేటర్‌ ఎన్నికల్లో అమలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కలిసికట్టుగా పనిచేసి.. గ్రేటర్‌లో సత్తా చాటి.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రధాన పోటీ అని చెప్పాలని ఆ పార్టీ నేతలు ఉవ్విల్లూరుతున్నారు.