తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి షురూ అయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేశాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు సిట్టింగులకే ప్రాధాన్యమిచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించిన అశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ మారే ప్రయత్నం చేస్తుంటే.. మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇంకొందరు మాత్రం ఇప్పటికీ ఆశ ఉందంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల వద్దకు వెళ్తున్నారు. ఇక తాజాగా జనగామ బీఆర్ఎస్ టికెట్ బీసీ వర్గానికి చెందిన తనకే కేటాయించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి ఆప్కో మాజీ ఛైర్మన్ మండల శ్రీరాములు సాష్టాంగ నమస్కారం చేశారు. స్థానికేతరులైన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ టికెట్ కోసం తమ ప్రయత్నాలు మానుకోవాలని శ్రీరాములు డిమాండ్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలకూ ఇంకా పదవీకాలం ఉందని, ఎమ్మెల్యే కావాలనుంటే వారి సొంత నియోజకవర్గాల్లో ప్రయత్నించుకోవాలని పేర్కొన్నారు.