తెలంగాణలో ఈ నెల 21 నుండి బిజెపి బైక్ ర్యాలీ చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల ఘోష – బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ బైక్ ర్యాలీలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 30 మంది నేతలు పాల్గొననున్నారు. బీజేపీలోని ఒక్కో అగ్రనేతకు 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఒక్కో నియోజకవర్గంలో 10 రోజులపాటు ఈ పర్యటనలు సాగనున్నాయి. రోజుకు ఎనిమిది నుండి పది గ్రామాలలో బైక్ ర్యాలీలో నిర్వహించనుంది బిజెపి. మొత్తం నాలుగు విడతలుగా ఈ బైక్ ర్యాలీలు సాగనున్నాయి. ఇదిలా ఉంటే..రేపు కరీంనగర్ లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు.
రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) మౌన దీక్ష పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్ లో రేపు ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు తలపెట్టిన ఈ మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటారు.