తెలుగు చిత్ర సీమలో అగ్రతారలుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల మైత్రి బంధం గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ సినిమాతో పాటు రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పటికీ ఏఎన్ఆర్ మాత్రం సినిమా రంగంలోనే చివరి వరకు ఉన్నారు.వీరిరువురు కలిసి నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. సాంఘీక, పౌరాణిక పాత్రలకు వీరు పెట్టింది పేరు. కాగా, ఒకానొక సందర్భంగా కృష్ణుడి పాత్ర పోషించాలని ఏఎన్ఆర్ ను ఎన్టీఆర్ సీఎం చేత అడిగించారట.అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.
కృష్ణుడు, రాముడు వంటి పాత్రలను ఎన్టీఆర్ పోషించిన క్రమంలో జనాలు ఆయన్ను అన్న గారు అంటూ ఆదరించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఒకానొక టైమ్ లో ఏఎన్ఆర్ చేత కృష్ణుడి వేషం వేయించాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. తాను అడిగితే ఏఎన్ఆర్ ఏమంటారోనని భావించి..అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో నాగేశ్వరరావును అడిగించారు. ముఖ్యమంత్రి అడిగినప్పటికీ ఏఎన్ఆర్ నో చెప్పడం విశేషం. ఈ విషయమై స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు.
ఎన్టీఆర్ తన కంటే ఎత్తు ఉన్నాడని, ఆయన వాయిస్ గంభీరంగా ఉంటుందని పేర్కొన్న ఏఎన్ఆర్..తాను కృష్ణుడి పాత్రకు తగనని తెలిపారు. తనకు కేవలం టాలెంట్ మాత్రమే ఉందని, ఆహార్యం, వాచకం ఆ పాత్రకు సరిపోయే విధంగా లేదని చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రలను సైతం పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారని తెలిపారు. తను కృష్ణుడి పాత్రకు సరిపోతానని అనిపించినప్పటికీ అప్పటికే కృష్ణుడిగా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు., కాబట్టి తాను వేయలేనని ఏఎన్ఆర్ సుస్పష్టంగా చెప్పడం గమనార్హం. అయితే ఏఎన్ఆర్ చాణక్య చంద్రగుప్త వేషం వేయడానికి మాత్రం ఒప్పుకున్నారు. రామారావు, నాగేశ్వరరావు ఇద్దరూ కలిసి సుమారు 15 చిత్రాల్లో నటించారు.