బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన్ను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఈ కేసులో క్రిశాంక్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి పోలీసుల ఎదుటకు ఆయన వచ్చారు. ఈ క్రమంలో ఈ వీడియోల ప్రామాణికతపై క్రిశాంక్ ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లోని చెట్లను ప్రభుత్వం నరికివేస్తుందంటూ గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వందల ఎకరాల్లో చెట్లపైకి రేవంత్ రెడ్డి సర్కార్ బుల్డోజర్లను పంపారంటూ ఈ వీడియోల్లో పేర్కొన్నారు. చెట్లు నరికే క్రమంలో పలు వన్య ప్రాణులు మృత్యువాత పడినట్లు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలన్నీ ఫేక్ అని, ఏఐ జనరేటెడ్ వీడియోలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విచారణకు హాజరయ్యారు.