హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గంటగంటకు పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాధారణ దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆదివారం రోజు కూడా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. మరోవైపు ఆదివారం రోజున మల్లన్న దర్శనానికి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. అయితే మల్లన్న జాతరలో గులాబీ పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.
శాసన మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, హనమకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ రైతు రుణవిమోచన కార్పొరేషన్ ఛైర్మన్ నాగూర్ల వేంకటేశ్వర్లు మల్లన్న దర్శనానికి ఆదివారం రోజున ఐనవోలుకు వచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే క్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు వారిని అడ్డుకుని దర్శనం టికెట్ చూపాలని కోరారు.
అప్పటికే అధికారులు చెప్పడంతో డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు రూ.50 వేలతో 100 టికెట్లను కొనుగోలు చేసి అవి చూపినా పాలకులు, పోలీసులు, దేవాదాయశాఖ అధికారులు ముఖద్వారం వద్ద తాళం వేసి అరగంట సమయం వారిని నిలిపివేశారు. అనంతరం ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వామివారిని బీఆర్ఎస్ నేతలు దర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదని బీఆర్ఎస్ నేతలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.