నేడు బీఆర్​ఎస్ విస్తృతస్థాయి సమావేశం

-

ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇరవై రోజుల వ్యవధిలో ఈ భేటీ మరోసారి జరగనుంది. బీఆర్​ఎస్ శాసనసభ పక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నేడు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ కీలక భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా హాజరు కావాలని కేసీఆర్ తెలిపారు. గతనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇరవై రోజుల వ్యవధిలోనే కర్ణాటక ఫలితాలు వెలువడగానే మళ్లీ సమావేశం జరపడంపై రాజకీయ ఆసక్తి నెలకొంది.

 తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకలే ప్రధాన అంశంగా సమావేశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాలను 21 రోజులు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు ముందు.. ఆ తర్వాత పరిస్థితులను ప్రజలకు వివరించేలా విస్తృతంగా చేపట్టే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను కూడా భాగస్వామ్యం చేయాలని బీఆర్​ఎస్ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news