మాది బరాబర్ కుటుంబ పాలనే.. పక్కా రాజకీయ వారసత్వమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెల్చిచెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
నిన్న ప్రధాని పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మాట్లాడితే చేతగాని మాటలు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్నాడు. బరాబర్ కుటుంబ పాలనే అందులో అనుమానమే లేదు. ఎందుకంటే.. కేసీఆర్ 4 కోట్ల మందికి కుటుంబ పెద్ద. 70 లక్షల మంది రైతులకు, వారి కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్నాడు. 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4 వేలు పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలబడి ఊతకర్ర అయ్యారు. ఊసులేనోడు వచ్చి వారసత్వ రాజకీయం అని అంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. పక్కా రాజకీయ వారసత్వమే.
బీఆర్ఎస్ పార్టీది బరాబర్ రాజకీయ వారసత్వమే. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ.. తెలంగాణ పౌరుషం. రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే.. గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. గొప్ప గొప్ప ఆలయాలు.. యాదాద్రి వంటి ఆలయాలను కట్టుకున్నాం. ఆనాడు కాకతీయులు చేసిన పనిని ఈనాడు మళ్లీ కేసీఆర్ చేస్తున్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వారసత్వం మాది. అందుకే ఆనాడు కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ అంటే.. ఈ రోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ది. పక్కా మాది కుమ్రం భీం వారసత్వమే.