శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన భారత్ రాష్ట్ర సమితి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే లోక్‌సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న ఈ పార్టీ ఈరోజు నుంచి రెండో దఫా సమావేశాలను మొదలుపెడుతోంది. మొదటి దశలో పది నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు పూర్తైన విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు మిగిలిన ఏడు నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుంది. రేపటి నుంచి వరుసగా మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్ గిరి నియోకవర్గాల సమావేశాలు ఉంటాయి.
ఈనెల 21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశం జరుగుతుంది. 22వ తేదీన నల్గొండ నియోజకవర్గంతో సమావేశాలు ముగియనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని విశ్లేషిస్తూనే లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. సమావేశానికి వచ్చిన నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు.