దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇందులో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మళ్లీ విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరు కాలేదు. మరోవైపు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఈడీ ఎదుట ఇవాళ ఆమె హాజరు కావాల్సి ఉండగా.. కవిత హాజరుకావడం లేదని ఆమె తరఫున న్యాయవాదులు ఈడీకి లేఖ రాసినట్లు సమాచారం.
లిక్కర్ స్కామ్ కేసులో ఆమె పాత్రపై విచారించేందుకు గతంలో పలుమార్లు ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతరత్రా అవకాశాలు ఉన్నప్పటికీ ఒక మహిళను విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అయితే ఈ నెల 5వ తేదీన ఈడీ మరోమారు కవితకు నోటీసులు జారీ చేసి ఈ నెల 17న(బుధవారం) దిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. ఓ పక్క న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగా మళ్లీ నోటీసులు జారీ చేయడం సరికాదని, విచారణకు కవిత హాజరుకారని ఆమె తరఫు న్యాయవాదులు ఈడీకి ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం.