ఈనెల 24న లక్షలాదిమందితో ఔరంగాబాద్ లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ – జీవన్ రెడ్డి

-

మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు నీరాజనం పలుకుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంబాజీనగర్ జిల్లా లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గులాబీ పార్టీ పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తూ ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జైకొడుతున్నారన్నారు.

ఈ నెల 24న ఔరంగబాద్ అంకాస్ మైదానంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామన్నారు. “మహారాష్ట్ర” ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని, గ్రామాల్లో తెలంగాణ మోడల్ గురించి వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. ఔరంగబాద్ సభా వేదికపై నుంచి గౌరవ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం చేస్తారన్నారు. ఔరంగబాద్ సభావేదికపై కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి కీలక నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరనున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు.

మహారాష్ట్ర దేశానికే ఆర్థిక రాజధానిగా ఉన్నప్పటికీ ఎందుకీ వెనుకబాటు తనమని? ఆయన నిలదీశారు.
మహారాష్ట్రలో ఆదాయ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, బడ్జెట్ కూడా బాగానే ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లవి అభివృద్ధి నిరోధక విధానాలని, ఈ రెండు జాతీయ పార్టీల నిర్వాకం వల్లే దేశం అభివృద్ధిలో వెనుకబడిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
దేశమంతా తెలంగాణ పథకాలు అమలై దేశాభివృద్ధి సాధించడం ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మోడీ గుజరాత్ మోడల్ ఫేక్ అని, ప్రగతికి ప్రతీక కేసీఆర్ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ మొదటి సభకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.

కేసీఆర్ నాందేడ్ లో అడుగు పెట్టగానే మహారాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు తరహా పెట్టుబడి సాయం కోసం రూ.6,900 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందన్నారు. కందార్ లోహలో లక్ష మందికి పైగా హాజరైన ప్రజల ఆశీస్సులతో రెండో సభ విజయవంతం అయిందన్నారు. ఈ రెండు సభల్లో వివిధ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి ఎకరానికి రూ. 10వేల చొప్పున ఇప్పటికే 62 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 80వేల కోట్లు నేరుగా బదిలీ అయ్యాయన్నారు. మహారాష్ట్ర లో ఒక కుటుంబంలో ఒక రైతుకే సాయమందిస్తామనడం కరెక్ట్ కాదని, తెలంగాణలో మాదిరిగా ఎంత మంది ఉంటే అంతమంది రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీ సర్కారు దుర్మార్గ విధానాలే మహారాష్ట్ర లో రైతుల ఆత్మహత్యలకు కారణమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిదేండ్ల కాలంలో రైతుల సంక్షేమం కోసం దాదాపు రూ. 4 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు జీవన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం కట్టడం ద్వారా దాదాపు 40వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కేసీఆర్ సాధించిన అతిపెద్ద విజయమన్నారు. దేశంలో మొత్తం 96 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట ఉత్పత్తి జరుగుతుంటే అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 56లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయన్నారు. 40వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని ఆయన అన్నారు.

రైతు ఏ కారణం చేతనైన చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 72 గంటల లోపు రూ.5 లక్షల చొప్పున చెల్లించే విధంగా రైతుబీమా అమలు చేయడం వల్ల బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 7,300 కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామాలకు వెళ్లి పంటల కొనుగోలు చేస్తూ రైతులకు ఏ కష్టం రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. 12,440 గ్రామాలకు మిషన్ భగీరధ ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జీవన్ చెప్పారు. కల్యాణ లక్ష్మీ ద్వారా ఒక లక్షా 116 రూపాయల చొప్పున ఇస్తూ ఇప్పటికే పది లక్షల మందికి పైగా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లను ప్రభుత్వమే జరిపించిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఉచిత ప్రసవాసాలను ప్రోత్సహిస్తున్నదని, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం తో పాటు మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇవ్వడంతో పాటు తల్లీపిల్లలకు బట్టలు పెట్టడమే కాక శిశువు ఆలనాపాలన కోసం వివిధ రకాల వస్తువులు ఉన్న కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. పుట్టిన క్షణం నుంచి నూరేళ్ళ జీవితం ముగిసి వైకుంఠ దామం చేరేవరకు వారికి కావాల్సినవన్నీ ప్రభుత్వమే సమకూరుస్తున్నదన్నారు. ప్పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్షా పాతిక వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. తొమ్మిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని విజయాలు సాధిస్తే డబులింజన్ సర్కార్ అని చెప్పే మహారాష్ట్ర లో ఎందుకు అభివృద్ధి సాధించలేదని ఆయన ప్రశ్నించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తమకు స్పూర్తిదాయకమన్నారు. కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ అని జీవన్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆయన స్పూర్తితో కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదన్నారు. ఇదిలావుండగా నాందేడ్, కందార్ సభలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా, వాహనాలను అడ్డుకున్నా ఆ సభలు సక్సెస్ అయ్యాయన్నారు. కేసీఆర్ కు మహారాష్ట్ర లో ఏం పనని ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారని జీవన్ రెడ్డి గుర్తు చేస్తూ తెలంగాణ లో అమలవుతున్న పథకాలను మహారాష్ట్ర లోనూ అమలు చేస్తే తాను ఇక్కడికి రానని కేసీఆర్ సమాధనమిచ్చారన్నారు.

మోడీ గోల్ మాల్ మోడల్ కావాలా?, అసలు సిసలైన కేసీఆర్ మోడల్ కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఔరంగబాద్ సభను జయప్రదం చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ,ఐ డీ సీ చైర్మన్ వేణుగోపాల చారి , మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మానిక్ కదం, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, అభయ్ పాటిల్, ఖదీర్ మౌలానాలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version