రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్‌లో నిర్మించిన ‘బుద్ధవనం’లో రేపు (వైశాఖ పౌర్ణమి) ‘2567వ బుద్ధజయంతి ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం ప్రకటనలో తెలిపారు. దశాబ్దాలుగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం శాంతి సందేశాన్ని అందిస్తూనే ఉందని అన్నారు.
అలాంటి గొప్ప ప్రదేశం నుంచి భారతీయ బౌద్ధ మహాసభ (తెలంగాణ విభాగం), బుద్ధవనం ఆధ్వర్యంలో 200 కార్లతో ర్యాలీగా ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్‌కు బయలుదేరుతామని తెలిపారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ ఈ ర్యాలీని ప్రారంభిస్తారని చెప్పారు. హరియాణా ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఉండ్రు, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొంటారని వెల్లడించారు.
బుద్ధవనంలో ఉదయం బౌద్ధ భిక్షువులు ప్రార్థనలతో ఉత్సవాలను ప్రారంభిస్తారని లక్ష్మయ్య తెలిపారు. యూజీసీ పూర్వాధ్యక్షులు సుఖదేవ్ థోరాట్ ‘మెన్సెకాంగ్ ధర్మశాల టిబెట్ హెర్బల్ కేంద్రం’ వారి ఆరోగ్యశిబిరాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌లతో పాటు బౌద్ధమేధావులు పాల్గొంటారని చెప్పారు.