తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న రుణాలు ఏటేటా పెరుగుతూ పోతున్నాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21తో పోలిస్తే 2021-22లో 16% అదనంగా అప్పులు నేరుగా ప్రభుత్వం తీసుకుందని వెల్లడించింది. ఈ మేరకు 2022 మార్చి 31 నాటికి నేరుగా ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు రూ.3.21 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. ఇది ‘రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ (జీఎస్‌డీపీ)’లో 28 శాతానికి సమానమని పేర్కొంది.
2017-18లో జీఎస్‌డీపీలో అప్పుల శాతం 22 ఉండగా ఐదేళ్ల వ్యవధిలో అది మరో 6% పెరిగినట్లు కాగ్ వివరించింది. 2021-22లో రూ.19,161 కోట్లను వడ్డీలు, అప్పుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించిందని.. ఇవికాకుండా మరో రూ.1.35 లక్షల కోట్లకు పైగా రుణాలను వివిధ ప్రభుత్వ సంస్థలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిందని తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలెంత అనే వివరాలను బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం చూపడం లేదని కాగ్ పేర్కొంది.