పరేడ్ గ్రౌండ్ లో ప్రతి ఏడాది జరిపే రిపబ్లిక్ వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికె విరుద్ధమని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని విమర్శించారు.
“పరేడ్ గ్రౌండ్ లో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం. రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధం.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమే. రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే ఇది. సీఎం తీరును బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.
గవర్నర్ కు దక్కాల్సిన ప్రోటోకాల్ ను పాటించడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించడం లేదు. మహిళలంటేనే కేసీఆర్ కు చిన్నచూపు. అందుకే మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. రాజ్యాంగపరంగా ఉన్నత పదవిలో ఉన్న గవర్నర్ నే గౌరవించడం చేతగాని కేసీఆర్ మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేస్తారో, వారికి 35 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలు ఆలోచించాలి.స్వతంత్ర్య భారతదేశంలో గణతంత్ర వేడుకలు ఎక్కడైనా స్వేచ్ఛగా నిర్వహించే హక్కుంది. నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. కరోనా సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేమని చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారు. కేసీఆర్ ను జోకర్ లా చూస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించే బహిరంగ సభలకు అడ్డురాని కరోనా నిబంధనలు గణతంత్ర వేడుకలకు వర్తింపజేయడం సిగ్గు చేటు.
దేశంలో రాచరిక, అవినీతి, కుటుంబ పాలనకు అవకాశం లేదని… ప్రజాస్వామ్య పాలన మాత్రమే కొనసాగుతుందనే సంకేతాలను పంపడమే రిపబ్లిక్ డే వేడుకల ఉద్దేశం. రాచరిక పాలనను తలపిస్తున్న కేసీఆర్ కు భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రజలకు తెలియకూడదని ఈ కుట్ర చేసినట్లుంది.ఎందుకంటే ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా కేసీఆర్ కు ఏమాత్రం నమ్మకం లేదు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నరు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంనడం అందులో భాగమే. ఏకంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాయాలని చెబుతున్నారు.
రాష్ట్ర గవర్నర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే నచ్చక గవర్నర్ ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పిలిపించుకుని గవర్నర్ వ్యవస్థను కించపర్చేలా మాట్లాడిస్తున్నారు. పైగా దొంగే దొంగ అన్నట్లుగా గవర్నరే తమను అవమానిస్తున్నారనడం సిగ్గు చేటు.కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే పౌరులకు స్వేచ్ఛ లేదంటారు. ఎన్నికలను రద్దు చేస్తారు. ప్రజలకు ఓటు హక్కు కూడా తీసేస్తారమో… ఇదే జరిగితే తెలంగాణలో ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయో విజ్ఝులైన మేధావులు ఆలోచించాలి. ప్రమాదకర కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రపంచంలోనే అత్యుతున్న ప్రజాస్వామ్యాన్ని అందించిన అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలి” అన్నారు బండి సంజయ్.