కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఇప్పటికే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తోపాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురికి ఈ పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను ఈ అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్ర సర్కార్ గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో మొత్తం ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారం ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పీవీ నర్సింహారావుకు భారతరత్న రావడం పట్ల రాజకీయాలకతీతంగా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక పీవీ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడితే 1991 నుంచి 1996 వరకు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగానూ సేవలందించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.