నాగార్జునసాగర్‌ వివాదం.. కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి అధ్యక్షతన నేడు కీలక భేటీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జునసాగర్ జలాశయం వద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మధ్య సాగర్ వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో సాగర్ వివాదం సహా నాలుగు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.

నాగార్జునసాగర్ వద్ద ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ డ్యాంల నిర్వహణకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా నదిపై ప్రాధాన్యంగా గుర్తించిన 15  ఉమ్మడి జలాశయాల సంబంధిత ఔట్ లెట్లను నదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేయలేదు. ఈ సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు రానుంది. కేఆర్ఎంబీకి రెండు రాష్ట్రాల నుంచి నిధుల విడుదల అంశంపైనా చర్చిస్తారు. వీటితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలు, పరస్పర ఫిర్యాదులు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version