త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు.ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు.