తెలంగాణలో పెళ్లి అంటే మటన్ ఉండాల్సిందే. మటన్ లేదంటే కొంతమంది అటు వైపు కూడా చూడరు. కొంతమంది పులుగు బొక్క కోసం రక్తాలు చిందిస్తుంటారు కూడా. అడిగినంత కూర వేయడం లేదని కొందరు ఘర్షణలు పడి కేసుల వరకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పెళ్ళివారు వంటల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని కొన్ని సార్లు గొడవలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా నిజామాబాద్ లోనూ అలాంటి సంఘటనే జరిగింది. చిన్న గొడవ కాస్త పెద్ద ఘర్షణకు దారి తీసింది.
ఈ క్రమంలో ఇరు వర్గాలపై కేసులు సైతం నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువతికి, నందిపేట మండలానికి చెందిన ఓ యువకునికి పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతుండగా.. విందు సమయంలో ఓ చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. పెళ్ళికొడుకు తరఫునుంచి వచ్చిన కొందరు యువకులకు పెళ్లికూతురు తరపు వారు విందులో మటన్ వడ్డించారు.
అయితే తమకు ముక్కలు తక్కువ వేశారు అంటూ వడ్డించే వారితో ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్త పెద్దదిగా మారి ఇరువర్గాలవారు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, గరిటలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు చెందిన 19 మంది పై కేసులు నమోదు చేసి.. గాయపడిన 8 మందిని ఆసుపత్రికి తరలించారు.