తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ జిల్లాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజానాయకులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రీ కేసీఆర్ హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రజలకు పలు విషయాల గురించి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజలు తమ కళలతో ఆకట్టుకున్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తులందరికీ నివాళులర్పించారు.
అయితే ప్రతీ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా రాజ్ భవన్ లో మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. గవర్నర్ తమిళి సై తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఎట్ హోమ్ కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు ఎవ్వరూ హాజరు కాలేదు. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీ నేతలు హాజరు కాకపోవడం పై పలువురు చర్చించుకుంటున్నారు.