అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్న తెలంగాణ నూతన సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించేందుకు ఇవాళ మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై కేసీఆర్ సమీక్షించనున్నారు.
నారాయణ్‌పూర్, కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల పనులపై కూడా కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. నూతన సచివాలయంలో కేసీఆర్ తొలి సమీక్ష ఇదే.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించన విషయం తెలిసిందే. నిన్న ఆరు కీలక దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు కూడా ఆయా దస్త్రాలపై సంతకాలు చేసి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఎప్పటిలాగే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే కేసీఆర్ ప్రభుత్వం నూతన సచివాలయంలో తొలి సమీక్ష కూడా ఆ రంగానికి సంబంధించే నిర్వహించడం గమనార్హం.