గత ఐదు రోజులుగా రాష్ట్రాన్ని వరణుడు వణికిస్తున్నాడు. ఇంట్లో నుంచి జనం బయటకు రాకుండా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రంలోని నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ … రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై.. వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బీసీ శాఖలపై సీఎం సమీక్ష జరిపారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వర్షాల వల్ల రాష్ట్రంలో ఒక్క ప్రాణానికి కూడా ప్రమాదం రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలపై భేటీలో కేసీఆర్ చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు.. తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై కూడా చర్చ జరిపారు.