తెలంగాణ రాజసం.. హైదరాబాద్ చరిత్రపుటలో మరో అద్భుత కట్టం.. నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ అద్భుత సమయాన రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు వెలువరించనుంది. ఆయా వర్గాలకు మేలు చేసే పలు ప్రతిపాదనల దస్త్రాలపై సీఎం కేసీఆర్ సంతకం చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేయనున్నారు. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగేలా డైట్ ఛార్జీలు 25 శాతం పెంచాలని మంత్రుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించింది.
దళితబంధు పథకం రెండోవిడత విధివిధానాలనూ సీఎం ఆమోదించనున్నారు. వివిధ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యాపథకం కింద నిధులు మంజూరు చేయనున్నారు. పేదల కోసం గతంలో సమీకరించిన స్థలాలు పంపిణీ చేసేందుకు, హైదరాబాద్‌లో నోటరీ భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలపై సంతకం చేస్తానని భారాస ప్రతినిధుల సభలో సీఎం ప్రకటించారు. గృహలక్ష్మి పథకం విధివిధానాల రూపకల్పనకూ ఆదేశించనున్నారు.