విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక అదేశాలు జారీ చేసింది. ఇకపై విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై ఫిర్యాదులు అందకపోయినా.. కేసు నమోదు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే విషయమై 2022లో 3 రాష్ట్రాలకు వర్తించేలా ఇచ్చిన తీర్పు పరిధిని విస్తరిస్తూ.. శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
కేసులు నమోదు చేయడం ఆలస్యం చేస్తే.. కోర్టు ధిక్కారంగా భావిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విద్వేషపూరిత ప్రసంగం చాలా తీవ్రమైన అంశమని.. ఇది దేశ లౌకికత్వాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. మతంతో సంబంధం లేకుండా 2022 అక్టోబర్ 21న ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతులని.. వారు కేవలం భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టకుని తీర్పులిస్తారని సుప్రీం కోర్టు చెప్పింది.