పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులతో సమీక్ష ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలల్లో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకునేట్లు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల వారీగా అభివృద్ది ఎజెండాను తయారు చేసుకోవాలని సూచించారు.
మరోవైపు ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తొలి సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి సభలో సీఎం పాల్గొన్న విషయం తెలిసిందే. ఈసారి పర్యటనలో ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని కూడా ప్రకటించారు. జనవరి 26వ తేదీ తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని కూడా సీఎం తెలిపారు.