సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేడీ.. మోడీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు కేడీ, మోడీ కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాత్రి పూట కలిసుండి.. పగలు తిట్టుకుంటూ నాటకాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలను చీల్చి.. ప్రభుత్వాలను కూల్చటమే గుజరాత్ మోడల్ అన్న రేవంత్ రెడ్డి పార్టీలను బెదిరించేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను పంపటమే మోదీ మోడల్ అని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ జనజాతర సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
చేవెళ్ల సభలో కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. రేవంత్ పేరు చెప్తే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ అన్నారని గుర్తు చేసిన రేవంత్.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటయినా గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. “రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పుకుని పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడాను. నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ వచ్చాను. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరు.” అని రేవంత్ అన్నారు.