జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డ ఆనకట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి, తాను మేడిగడ్డ ఆనకట్టను సందర్శిస్తామని తెలిపారు. పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ తో జలసౌధలో సమావేశమై సంబంధిత అంశాలపై ఉత్తమ్ చర్చించారు. వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరోవైపు మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఉత్తమ్.. ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వర్షాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున యుద్ధప్రాతిపదిక రక్షణ చర్యలతో పాటు అవసరమైన మరమ్మతులు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలిపిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు.. మరింత వేగవంతం చేస్తామని చెప్పినట్లు సమాచారం. అవసరమైతే రాత్రి పగలు పనులు చేయాలని మంత్రి వారికి సూచించినట్లు తెలిసింది.