మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డపై బీజేపీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం అందరికీ తెలిసిందేనన్న రేవంత్ మేడిగడ్డ ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిని బీజేపీ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని.. తెలంగాణ ప్రజల నమ్మకం అన్ని అన్నారు. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదని.. 4 కోట్ల ప్రజల ఆశలని పేర్కొన్నారు. ప్రాజెక్టుపై సాంకేతిక నిపుణులు ఇచ్చే నివేదిక మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని.. హడావుడిగా ముందుకెళ్తే… కేసీఆర్ చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
“మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణను కోరాం. సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు అంటున్నారు. న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా? సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని చూస్తున్నారు. వరంగల్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి.. మేడిగడ్డకు ఎందుకు రాలేదు? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం భావించాం. సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై మా నిర్ణయం చెప్తాం. అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లను తొలగించాం. కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోంది. అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం.” అని రేవంత్ అన్నారు.