రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ప్రస్తుతం అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్స్పెక్టర్ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. కాంగ్రెస్ సర్కార్ మానవ హక్కుల రక్షణలో విఫలమైందని అన్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దళితులపై అణచివేత నానాటికీ తీవ్రమవుతోందని మరో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.