78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో, మండలాలు, పంచాయతీల్లో జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానుభావుల త్యాగాలతో స్వాతంత్య్రం సాధించామని చెప్పారు. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈస్థాయిలో ఉందని.. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉందని చెప్పారు. బీహెచ్‌ఈఎల్, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించారని.. లాల్‌బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ సాగులో విప్లవం తెచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలేనన్న సీఎం.. 2004లో తెలంగాణ ఇస్తామని సోనియా కరీంనగర్‌లో మాటిచ్చారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.