ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రాధాన్యతలు అట్టడుగు స్థాయిలోని ప్రజలకు అందాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా పని చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆశించే లక్ష్యం సాకారం కావాలంటే ఈ దిశగా ప్రయాణం చేయాల్సి ఉంటుందని, అప్పుడే ఫలాలు ప్రజలకు అందుతాయని, ఫలితాలు వస్తాయని నొక్కి చెప్పారు. ప్రభుత్వం సచివాలయం స్థాయిలో తీసుకుని నిర్ణయాలు, ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్సీల మొదలు గ్రామ స్థాయి వరకు సమిష్టిగా, చిత్తశుద్ధితో కృషి చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.
ఏ ఒక్కరు వెనకబడినా ఆ మేరకు తేడాలు ఉంటాయన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్సీలతో ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల పాటు నిర్వహించిన కాన్ఫరెన్సులో 6 గ్యారంటీల అమల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. నిస్సహాయులకు సాయం అందాలని, గతంలో ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకరన్ దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉదయం 9 గంటలకు సచివాలయానికి వచ్చి రాత్రి వరకూ ప్రజల బాధలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టి తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు.