తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులు సహా మరికొన్ని కీలక అంశాలపై రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు సమాచారం.
త్వరలోనే తెలంగాణలోని సూర్యపేట, గద్వాలలో రాహుల్ గాంధీ సభలు ఉండనున్నాయి. తెలంగాణ లో కులగణన పూర్తి అయిన సందర్భంగా సూర్యపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి సభను నిర్వహించే తేదీ పై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అమలు పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ లో గద్వాల్ లేదా మెదక్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.