హైదరాబాద్‌నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష జరిపారు. సమీక్షలో భాగంగా మెట్రోరైలు ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి గారు రెండో దశ ప్రతిపాదనలపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.

అత్యధిక మంది ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు. దీని కోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలని మెట్రోరైలు ఎండీ ని ఆదేశించారు. దారుల్ షిఫా జంక్షన్ నుండి షాలిబండ వరకు గల మెట్రోరైల్ స్ట్రెచ్ మార్గాన్ని రోడ్డును వెడల్పు చేయాలన్న హెచ్ఎంఆర్ఎల్ చేసిన ప్రతిపాదనలపై పాతబస్తీ ప్రజా ప్రతినిధులతో సంప్రదించి దారుల్ పిషా జంక్షన్ నుండి ఫలక్ నుమా జంక్షన్ వరకు రహాదారిని 100 ఫీట్ల వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. దీనివల్ల పాతనగరం ఇతర ప్రాంతాలతో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని అన్నారు.