కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం దిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పర్యటనలో ఆయన పార్టీ నాయకులతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు వెల్లడించాయి.
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించి పెట్టుబడుల గురించి, పలు కంపెనీలతో జరిగిన ఒప్పందాల గురించి వారికి వివరించనున్నట్లు సమాచారం. ఇక రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల ఎన్నిక, మంత్రి వర్గ విస్తరణ వంటి విషయాలపై కూడా అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు.