రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టులో ఈ పర్యటన ఉండనున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో పర్యటన షెడ్యూల్‌ను వెల్లడించింది. ఆగస్టు 3వ తేదీన రాత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికాకు బయల్దేరనుంది. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాల్లో సీఎం రేవంత్ అండ్ టీమ్ పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానుంది.
ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికాలో పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. ఈ సందర్భంగా వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి ఆగస్టు 11వ తేదీన ఆయన అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు అగ్రరాజ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.
మరోవైపు ఈ ఏడాది జనవరిలో వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌తో పాటు లండన్, దుబాయ్‌లో ముఖ్యమంత్రి బృందం పర్యటించింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు కేంద్రంగా పారిశ్రామికవేత్తలతో చర్చించి సుమారు రూ.40,000ల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు అప్పట్లో వెల్లడించాయి.