తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ నదీతీర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నగరంలోని మురుగునీరంతా మూసీలో చేరుతోందని.. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. దీనివల్ల హైదరాబాద్ నగరవాసుల నీటి ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు.
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రోజున ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జల్‌జీవన్ మిషన్ పథకం 2019లో ప్రారంభమైనా ఇంతవరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని.. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు ఇంకా నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని కేంద్రమంత్రికి తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు ఖర్చవుతుందని.. జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు.