ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్నను నిలబెట్టింది. మల్లన్నను గెలిపించేందుకు పని చేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లతో తాజాగా రేవంత్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేసి ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈనెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలని తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, తీన్మార్ మల్లన్నఎన్నిక, కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పని చేసి గెలుపునకు పని చేయాలన్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు సూచించారు.