హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో ఓ కొబ్బరి బోండాల వ్యాపారి, అతని అనుచరులు వీరంగం సృష్టించారు. విధుల్లో ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఉదయాన్నే విధుల్లోకి వెళ్లిన మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ సమస్య దృష్ట్యా రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొబ్బరి బోండాలు పెట్టొద్దని సదరు వ్యాపారికి సూచించారు. అయినా వారు వినకపోవడంతో కొబ్బరి బోండాలను జీహెచ్ఎంసీ వాహనంలో వేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో సదరు వ్యాపారి జీహెచ్ఎంసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. గొడవ చినికి చినికి గాలి వానలా మారి కోపోద్రిక్తుడైన వ్యాపారి అతని అనుచరులతో కలిసి మున్సిపల్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత సిబ్బంది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బూతులు తిడుతూ తమపై రాళ్ల దాడికి దిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.