అర్ధరాత్రి సమయంలో గిరిజన విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు ఓ కళాశాల ఛైర్మన్. ఈ ఘటన హనుమకొండ జిల్లా కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్‌పర్తి మండలం భీమారంలో ఓ జూనియర్ కళాశాలలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఆమె కేకలు వేయడంతో తోటి విద్యార్థినులు బయటకు వచ్చి రక్షించేందుకు ప్రయత్నించగా సదరు ఛైర్మన్ వారిపై చేయి చేసుకున్నాడు. బాధిత విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా ఈ విషయం తెలపగా వారు శనివారం రోజున కళాశాలకు చేరుకుని ఘటనపై యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు, పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద బూర సురేందర్‌గౌడ్‌పై కేసులు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండలం భీమారంలోని తెలంగాణ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన పదహారేళ్ల విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రోజున కళాశాల ఛైర్మన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర సురేందర్‌గౌడ్ అర్ధరాత్రి ఒంటి గంట దాటాక హాస్టల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో హాస్టల్ గదిలో నిద్రిస్తున్న ఆ విద్యార్థిని పట్ల లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న తోటి విద్యార్థినులు నిద్రలేచి బయటకు రాగా తన స్నేహితులకు ఆమె జరిగిన విషయం చెప్పింది. ఈ క్రమంలో కోపగించిన సురేందర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ విద్యార్థినులపై చేయి చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.