మాజీ మంత్రి హరీశ్ రావు ను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. హరీష్ రావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. సీఎం అనే రాజ్యాంగబద్ధ పదవిని అగౌరవపరిచే విధంగా హరీశ్ రావు మాట్లాడారని.. ఇది చట్ట వ్యతిరేకమని, అందుకే ఆయనపై బేగం బజార్ పీఎస్ లో సెక్షన్ 352, 353/1, 353/2 కింద ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఒక శాసన సభ్యునిగా ఉన్న మీరే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే.. సామాన్య ప్రజానీకానికి మీరిచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు.
హరీష్ రావు “చీప్ మెన్” అని బహుషా కేసీఆర్ ను అనబోయి.. రేవంత్ రెడ్డి ని అన్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గత పది నెలల్లో సీఎం పదవికి ఎంతో ఉన్నతిని తెచ్చారని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. సీఎం అనే పదానికి క్రెడిబిలిటీ తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.