కర్ణాటక ఫలితాలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాప్రతివ్యూహాలు రచిస్తోంది. ఓవైపు ప్రజల్లోకి వెళ్తూనే మరోవైపు పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకుంటోంది. అయితే ఈ క్రమంలోనే పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇది పెద్దగా కాక ముందే అసంతృప్తులను బుజ్జగించాలని పార్టీ యోచిస్తోంది.
ఇందులో భాగంగానే ఆపరేషన్ కూల్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. ఆపరేషన్ కూల్ పేరుతో మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి సహా.. మరి కొంతమందిని రంగంలోకి దించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు.. రెండు రోజుల క్రితం హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. అక్కడ టికెట్ ఆశిస్తున్న ఆశావహులను బుజ్జగించే పనిని సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
పార్టీలో చేరుతున్న మాజీ ఎంపీల కోసం పెద్దపల్లి, భువనగిరి, వరంగల్, రాజేంద్రనగర్ తదితర నియోజక వర్గాలను అట్టిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా టికెట్ రాని సొంత పార్టీ వాళ్లే అభ్యర్థులను ఓడించేందుకు అవకాశం ఉంటుందని.. పీసీసీ అంచనా వేస్తోంది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఎక్కడక్కడ అసమ్మతిని చల్లార్చేందుకు.. ఆపరేషన్ కూల్ చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.