కాంగ్రెస్ పార్టీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారిని రాష్ట్ర పత్నిగా అభివర్ణిస్తూ లోక్ సభ ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది కాంగ్రెస్ నేతల దురహంకారానికి నిదర్శనమన్నారు. దేశంలోని యావత్ గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలందరినీ కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందన్నారు సోయం. అట్టడుగువర్గానికి చెందిన ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశానికే గౌరవమని అన్నారు.
రాష్ట్రపతి అనే పదం పురుషులు, మహిళలకు సమానమన్నారు.కానీ గిరిజనులు, పేదలంటేనే కాంగ్రెస్ కు కడుపు మంట ఎందుకనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళ భారత దేశ ప్రథమ పౌరురాలు కాకుండా కాంగ్రెస్ అడుగడుగునా కుట్రలు చేసిందన్నారు. కుటుంబం, వారసత్వ రాజకీయాలు, దోచుకోవడం, దాచుకోవడంపై కాంగ్రెస్ నేతలకు ఉన్న మక్కువ అట్టడుగువర్గాలను ఆదుకోవడంపై లేనేలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో కాంగ్రెస్ నేతలను గిరిజన జాతి క్షమించే ప్రసక్తే లేదన్నారు.