టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్నారని.. బీసీ నాయకుల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. బీసీలను అణచివేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందన్నారు శ్రీనివాస్ గౌడ్.
బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ ఓట్లతో గెలిచి తమనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బీసీ నేతలను అవమానించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో కాంగ్రెస్ ని ఎదుర్కొంటామన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లను తిట్టిన వారు కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.