తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు నమోదైన ఫలితాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. తొలి గెలుపును జోరు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది. ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రావు అశ్వారావుపేట నియోజకవర్గంలో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు.
నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలుపొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సరైన అభివృద్ధి చేయకపోవడం.. ప్రజల్లో కలవకపోవడంతో ప్రజలు ఈసారి ఆయణ్ను గద్దె దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇంటింటికి వెళ్లి గ్యారెంటీలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మేలని భావించినట్లు తాజా ఫలితాలు చూస్తుంటే తెలుస్తోంది. అందుకే ఆ నియోజకవర్గ ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు.