తెలంగాణలో పదేళ్ల తరువాత తరువాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ 08, బీజేపీ 08, ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీటును కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన పీఆర్టీయూ మాత్రం విజయం సాధించింది. స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యాడు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఘోర ఓటమి పై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా పార్టీ పని తీరుపై వివరిస్తూ నివేదికను సమర్పించాలని టీపీసీసీని ఆదేశించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై నివేదిక సమర్పించాలని కోరారు. అభ్యర్థుల ఎంపికలో జాప్యం, చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు వల్లే ఓడిపోయామని తెలిపారు టీపీసీసీ నాయకులు. నెలల తరబడి ఓటర్లతో మమేకమైన ప్రసన్న హరికృష్ణ అభ్యర్థిగా ఉంటారని అందరం అనుకున్నామని.. కానీ రాష్ట్రంలోని నాయకులు హరికృష్ణకు బదులుగా నరేందర్ రెడ్డిని ఎంచుకోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు.