బీఆర్ఎస్తో పొత్తు.. కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం పై సీపీఐ మరోసారి స్పందించింది. సీఎం కేసీఆర్ కనీస రాజకీయ విలువలు పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అయినా చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని వెల్లడించారు. సమరశీల పోరాటాలు చేసి గ్రామగ్రామానా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని 30 సీట్లలో సీపీఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని సీపీఐ నేతలు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి బస్సు యాత్ర చేస్తామని వివరించారు. హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించి సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఎవరూ బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని, తమను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే కేసీఆర్కు తెలుసని విమర్శించారు.