కేంద్రంలోని బీజేపీప్రభుత్వం రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతో రైతులు ఆందోళన చేపట్టారన్నారు. దేవుళ్లను ఒక వైపు పూజిస్తూ.. మరో వైపు రైతులను చితకబాదుతున్నారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఏ దేవుడైనా రైతులను చితక బాదమని చెప్పారా అని ప్రశ్నించారు. పురాతనమైన దేవాలయాలను, మసీదులను మోదీ తొవ్విస్తున్నారని.. దీంతో పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉంటే ఎందుకు ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదొస్తున్నారో చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి జగన్ బానిస కాబట్టి ఆ ప్రభుత్వం జోలికి పోలేదని నారాయణ అన్నారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. భారత దేశం చరిత్రలో బెయిల్ పై సుధీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ అన్నారు. 17ఏ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి చంద్రబాబు కేంద్రానికి దాసోహం అంటున్నారని ఆరోపించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని.. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. విభజన హామీలను ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు.