బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్ల కాలం కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని తెలిపారు. ఇన్నాళ్లు ఏం చేయలేదు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ.. నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ కొత్తగా బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తి బండి సంజయ్ ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితపై బండి సంజయ్ తీవ్రంగా విమర్శలు చేసినందుకే జీర్ణించుకోలేకనే తొలగించారని అన్నారు. దేశంలో అబద్దాలు చెప్పే వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్ వన్ అని.. కేసీఆర్ నెంబర్ 2 అని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తానని ఎక్కడా చెప్పలేదని.. ఇప్పుడు ఇండియాటుడే ఇంటర్వ్యూలలో ఆ విషయం చెప్పానని ఇలా ప్రకటనలు చేస్తూ సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.